హార్దిక్ పాండ్యా-నటాషా రిలేషన్ కలకాలం నిలుస్తుందా?

9:37 am, Sun, 5 January 20

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా మోడల్, బాలీవుడ్ నటాషా స్టాంకోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకుని ఊహాగానాలకు తెరదించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దీంతో అభిమానులు, మీడియా ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు, స్నేహితులు హార్దిక్-నటాషా జంటకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

పాండ్యా, నటాషాలు ఇద్దరూ పూర్తిగా వేర్వేరు రంగాలు, భిన్న సంస్కృతుల నుంచి వచ్చినవారు. భవిష్యత్తులో ఇది వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇవి వారి జీవితాలను ఇబ్బంది పెట్టొచ్చని అంటున్నారు. అయితే, ఢిల్లీకి చెందిన మ్యారేజ్, రిలేషన్‌షిప్ కౌన్సెలర్ డాక్టర్ కమల్ ఖురానా మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపడేశారు.

ఇద్దరూ పూర్తిగా వేర్వేరు సంస్కృతుల నుంచి వచ్చినప్పటికీ దీర్ఘకాలంలో ఎటువంటి సమస్యలు రాబోవని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో ప్రేమ ఇద్దరినీ కలిపి ఉంచుతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయంలో కొన్ని సవాళ్లు ఎదురైనా.. ప్రేమ అనేది ఇద్దరి మధ్యం బంధంలా పెనవేసుకుంటుందని ఖురానా పేర్కొన్నారు. నటాషా యూరప్‌కు చెందిన అమ్మాయి అయినా భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకుని ఉంటుందని, కాబట్టి ఈ జంటకు వచ్చే ఇబ్బందేమీ లేదని ఖురానా తేల్చి చెప్పారు.