ఐపీఎల్ 2019 విజేత ముంబై ఇండియన్స్: ఉత్కంఠ పోరులో చెన్నైని చిత్తు చేసిన ముంబై

7:32 am, Mon, 13 May 19

హైదరాబాద్: క్రికెట్ అభిమానులని ఉర్రూతలూగించిన ఐపీఎల్ చివరి అంకం ముగిసింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ని ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ధోనీ సేనపై రోహిత్ సేన కేవలం ఒక్క పరుగు తేడాతో గెలుపొంది….2019 ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు, డికాక్ 17 బంతుల్లో 29 పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ (3/26), తాహిర్ (2/23), శార్దూల్ (2/37) ఆకట్టుకున్నారు.

చదవండి: ఫైనల్ లో చెన్నై! అనుభవం ముందు బొక్కబోర్లా పడ్డ ఢిల్లీ కుర్రాళ్లు!

ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టు…విజయం సాధించటం సులువు అని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఓపెనర్లు దూకుడుగా ఆడారు. డూప్లెసిస్ 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

అయితే డుప్లెసిస్ ఔట్ అయిన దగ్గర నుంచి చెన్నై వికెట్ల పతనం మొదలైంది. ఒకవైపు వాట్సన్(80) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుండగా….మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరు తనకు అండగా నిలవలేదు. వరుసగా వచ్చిన వారు వచ్చినట్లు ఔట్ అయ్యారు.

ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్..

ఈ క్రమంలోనే చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి  9 పరుగులు అవసరమయ్యాయి. వాట్సన్ క్రీజులో ఉండటంతో అంతా గెలుపు చెన్నైదే అనుకున్నారు. అయితే ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న మలింగ 7 పరుగులే ఇచ్చి ముంబైని గెలిపించాడు. తొలి రెండు బంతులకు సింగిల్స్ రాగా.. మూడో బంతికి డబుల్ వచ్చింది. నాలుగో బంతికి రెండో రన్‌కు యత్నించిన వాట్సన్ రనౌట్ అయ్యాడు.

ఐదో బంతికి శార్దుల్ 2 పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో యార్కర్‌తో శార్దూల్‌ను ఔట్ చేయడంతో ముంబై సంబరాల్లో మునిగిపోయింది.  చివరికి సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

ఇక విన్నర్‌గా ముంబై ట్రోఫీతో పాటు 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కించుకుంది. రన్నరప్‌గా చెన్నై 12.5 కోట్లు దక్కించుకుంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్(692) ఆరెంజ్ క్యాప్‌తో పాటు 10 లక్షలు ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఎక్కువ వికెట్లు తీసిన చెన్నై ఆటగాడు ఇమ్రాన్ తాహిర్(26) పర్పుల్ క్యాప్, 10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

awards

చదవండిప్రపంచ కప్: ఇంగ్లండ్‌కి భారీగా చేరుకుంటున్న భారత్ అభిమానులు….