ప్రో కబడ్డీ లీగ్‌ 2018: సొంత గడ్డపై వరుస పరాజయాలకు బ్రేక్, పాట్నా పైరేట్స్‌ నాలుగో గెలుపు…

Patna_Pirates5
- Advertisement -

Patna_Pirates5

పాట్నా: ప్రో కబడ్డీ లీగ్‌‌ సీజన్-6లో సొంతగడ్డపై వరుస పరాజయాలు చవిచూస్తోన్న పాట్నా పైరేట్స్‌ జట్టు ఎట్టకేలకు బ్రేక్‌ వేసి..  నాలుగో విజయం అందుకుంది. జోన్‌ ‘బి’లో గురువారం హోరాహోరీగా జరిగిన  మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌ 29–27 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌పై నెగ్గింది. దీంతో సొంత గడ్డపై చివరి మ్యాచ్‌ను పాట్నా పైరేట్స్ గెలుపుతో ముగించినట్లయింది.

- Advertisement -

పాట్నా పైరేట్స్ జట్టు కెప్టెన్, ‘డుబ్కీ’ కింగ్‌ పర్దీప్ నర్వాల్‌ గాయంతో బెంచ్‌కే పరిమితమైనప్పటికీ.. ఈ మ్యాచ్‌లో దీపక్‌ నర్వాల్‌ 7 రైడ్‌ పాయింట్లతో సత్తా చాటాడు. ట్యాక్లింగ్‌లో జైదీప్‌ కూడా 5 పాయింట్లతో రాణించాడు. ఇక బెంగాల్‌ వారియర్స్‌ జట్టు తరఫున  రణ్‌సింగ్‌ 7 పాయింట్లు , మహేశ్‌గౌడ్‌ 6 పాయింట్లు, జాంగ్‌ కున్‌ లీ 5 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది.

ఆరంభం నుంచి రెండు జట్లూ రక్షణాత్మకంగా ఆడడంతో పెద్దగా పాయింట్లు రాలేదు. జాంగ్‌ కున్‌ లీ రైడ్‌తో బెంగాల్‌ వారియర్స్‌ ఖాతా తెరిచింది. అయితే, పాట్నా పైరేట్స్‌ రైడర్లు వరుసగా విఫలం కావడంతో 4 నిమిషాల ఆట ముగిసే సరికి బెంగాల్‌ 4-0తో ముందంజ వేసింది. ఆ తరువాత, పాట్నా పైరేట్స్‌ కూడా పుంజుకుని వరుసగా పాయింట్లు సాధించి 5-5తో స్కోరు సమం చేసింది.

10వ నిమిషంలో రైడింగ్‌కు వచ్చిన రణ్‌ సింగ్‌ను పట్టేసిన పాట్నా పైరేట్స్ 9-7 స్కోరుతో ఆధిక్యం సాధించింది. ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ 15-12తో మొదటి అర్ధభాగం ఆటను ముగించింది.

రెండవ అర్ధభాగంలో ఇరుజట్లూ వడివడిగా పాయింట్లు సాధించినా పట్నా పైరేట్స్ జట్టు పైచేయిగానే నిలిచింది. 10 నిమిషాల ఆట ముగిసే సరికి 21-18తో ఆ జట్టు తన ఆధిక్యాన్ని కొనసాగించింది.  ఇక మరో మూడు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా ఇరు జట్లు 25–25తో నిలిచాయి. అయితే చివరికంటా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న పాట్నా పైరేట్స్  మ్యాచ్‌ను తన్రుకుపోయింది.

ఈ దశలో పర్దీప్ నర్వాల్‌ రైడింగ్‌లో పాయింట్‌ సాధించడం, ఆ వెంటనే జాంగ్ కున్‌ లీ ఔట్‌ కావడంతో దక్కిన 2 పాయింట్ల ఆధిక్యాన్ని పాట్నాపైరేట్స్‌ జట్టు కొనసాగించి గెలుపొందింది. ఇక ప్రో కబడ్డీలో లీగ్ 2018 సీజన్-6లో.. శుక్రవారం యూపీ యోధాతో తమిళ్‌ తలైవాస్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ తలపడతాయి.

ప్రొ కబడ్డీ లీగ్‌‌ నేటి మ్యాచ్‌లు..

యూపీ యోధా X  తమిళ్‌ తలైవాస్‌
జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ X గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌

- Advertisement -