ఓపెనర్‌గా ప్రపంచ రికార్డు సాధించిన రోహిత్‌శర్మ

7:04 pm, Fri, 17 January 20

రాజ్‌కోట్: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్‌శర్మ ఓపెనర్‌గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లను వెనక్కి నెట్టేశాడు. రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించాడు.

రోహిత్ 137వ ఇన్నింగ్స్‌లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా, ఆమ్లా 147, టెండూల్కర్ 160 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డు సాధించారు. అలాగే, 7 వేల పరుగులు సాధించిన నాలుగో ఇండియన్ క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ఆసీస్‌తో ముంబైలో జరిగిన తొలి వన్డేలో బ్యాట్‌తో విఫలమైన రోహిత్‌శర్మ.. రెండో వన్డేలో 42 పరుగులు చేసి ఆడం జంపా బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఓపెనర్‌గా అత్యంత వేగంగా 7,000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కిన రోహిత్.. నాలుగు పరుగుల తేడాతో మరో రికార్డును చేజార్చుకున్నాడు. వన్డేల్లో 9,000 పరుగులకు కోహ్లీ నాలుగు పరుగుల దూరంలో నిలిచాడు. కాగా, గతంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న రోహిత్‌ను 2013 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఓపెనర్‌గా పంపాడు. ఇక అప్పటి నుంచి ఓపెనర్‌గానే రోహిత్ దిగుతున్నాడు.