మూడు నెలల కంటే ఎక్కువ బతుకుతారని గ్యారెంటీ లేదుగా: అక్తర్ సంచలన వ్యాఖ్యలు

1 week ago

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని భయాందోళనలోకి నెట్టేసిన కరోనా వైరస్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో హిందూ, ముస్లింలా ఆలోచించకుండా మనిషిలా ఆలోచించాలని కోరాడు.

తన యూట్యూబ్ చానల్‌లో వీడియో పోస్టు చేసిన అక్తర్.. ప్రజలు జాతిమత భేదాలు, పేద, గొప్ప తారతమ్యాలను విడిచిపెట్టి ఒకరినొకరు సాయం చేసుకోవాలన్నాడు. ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఓ ‘ప్రపంచ శక్తి’లా పనిచేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ విజ్ఞప్తి. కరోనా వైరస్ అనేది ప్రపంచ సంక్షోభం. మనందరం ఓ ప్రపంచ శక్తిలా పనిచేసి మతాలకు అతీతంగా పనిచేయాలి. లాక్‌డౌన్‌లు జరుగుతున్నాయి కాబట్టి వైరస్ ఇక వ్యాప్తి చెందే అవకాశం లేదు. మీరు మళ్లీ బయటకు వెళ్లి మీటింగులు పెడితే లాభం లేదు’’ అని అక్తర్ పేర్కొన్నాడు.

‘‘కరోనా భయంతో ఇంట్లో నిల్వలు పెంచేసుకోవద్దు. షాపులు ఖాళీ చేయొద్దు. రోజువారీ కార్మికుల గురించి ఆలోచించండి. మూడు నెలల తర్వాత మీరు బతుకుతారన్న గ్యారెంటీ ఏమిటి? రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచించండి.

వారు తమ కుటుంబానికి తిండెలా పెడతారు? మిగతా వారి గురించి కూడా ఆలోచించండి. మనిషిలా జీవించండి. హిందూ, ముస్లింలా కాదు. ఒకరినొకరు సాయం చేసుకోండి. నిధులు సేకరించండి. ఆహార పదార్థాలు నిల్వచేసుకోవడం ఆపండి’’ అని అక్తర్ అభ్యర్థించాడు.

డబ్బున్న వారు బతికేస్తారని, పేదలు ఎలా బతుకుతారని అక్తర్ తన వీడియోలో ప్రశ్నించాడు. దయగా ఉండాలన్నాడు. మనం జంతువుల్లా బతుకుతున్నామని, మనుషుల్లా జీవిద్దామని అన్నాడు.

ఆహర పదార్థాలను నిల్వచేసుకోవడం మాని ఒకరినొకరు సాయం చేసుకోవాల్సిన సమయమిదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇది మతాల పేరుతో విడిపోయే సమయం కాదని, మనుషుల్లా జీవించే సమయమని పేర్కొన్నాడు.