యాషెస్ సిరీస్‌లో అదరగొడుతున్న స్మిత్.. అ‘ద్వితీయ’ శతకంతో వీర విహారం

8:08 am, Fri, 6 September 19

మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 319 బంతుల్లో 24 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 211 పరుగులు చేశాడు.

గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరమైన అతడు ఈ టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. తనంతట తాను వికెట్‌ ఇస్తే అదే గొప్పని వారు భావించేలా భీకర ఫామ్‌తో పరుగులు చేస్తున్నాడు.

స్మిత్ డబుల్ సెంచరీతో మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 170/3తో గురువారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా‌… స్మిత్‌కు తోడు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (127 బంతుల్లో 58; 8 ఫోర్లు), లోయరార్డర్‌లో మిచెల్‌ స్టార్క్‌ (58 బంతుల్లో 54 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు సాధించింది.

అంతకుముందు స్మిత్‌కు 118 పరుగుల వద్ద స్పిన్నర్‌ లీచ్‌ బౌలింగ్‌లో నోబాల్‌ రూపంలో లైఫ్‌ లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ(211; 310 బంతుల్లో)ని సాధించాడు.

అనంతరం పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు యత్నించి ఔటయ్యాడు. చివర్లో స్టార్క్, లయన్‌ (26 బంతుల్లో 26; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది.

అంతేకాకుండా చివరి 10 ఓవర్లలో 80పైగా పరుగులు రావడం విశేషం. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్‌ డెన్లీ (4) వికెట్‌ కోల్పోయి 23 పరుగులు చేసింది.