పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సురేశ్ రైనా భార్య

1 week ago

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా మరోమారు తండ్రయ్యాడు. రైనా భార్య ప్రియాంక సోమవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. టీమిండియా బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా రైనాకు కంగ్రాట్స్ చెప్పడంతో ఈ విషయం బయటకొచ్చింది.

2016లో రైనా-ప్రియాంక దంపతులు గ్రేసియాకు జన్మనిచ్చారు. తాజాగా, ఇప్పుడు వారికి బాబు జన్మించాడు. రైనా దంపతులకు హర్భజన్ కంగ్రాట్స్ చెప్పిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘‘కుట్టి తాలా’కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.

తమిళనాడులో రైనాను అభిమానులు ‘చిన్న తాలా’ అని పిలుస్తుంటారు. అందుకే సీఎస్‌కే ఇలా వెరైటీగా ట్వీట్ చేసింది. కాగా, ఆ తర్వాత రైనా కూడా తనకు బాబు పుట్టిన విషయాన్ని ట్వీట్ చేశాడు.

సురేశ్ రైనా చివరిసారి జూలై 2018న భారత్‌కు ఆడాడు. 2011 ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ 2019 వరకు బ్యాట్ పట్టలేదు. గతేడాది ఆగస్టులో మోకాలి ఆపరేషన్ చేయించుకున్నాడు.

ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నెల మొదట్లో సీఎస్‌కేలో తన సహచరులైన ధోనీ, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా తదితరులతో కలిసి చెన్నై క్యాంపులో శిక్షణ పొందాడు.

అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఆ తర్వాత దానిని రద్దు చేశారు.