సముద్రం మధ్యలో.. క్రికెటర్ హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం! ఎవరితోనో తెలుసా?

6:52 am, Thu, 2 January 20

ముంబై: బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లాడిన క్రికెటర్ల జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా చేరబోతున్నాడు. బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను త్వరలో పెళ్లాడబోతున్నాడు. సముద్రం మధ్యలో ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగారు.

ఈ విషయాన్ని హార్దిక్ తన ఇన్‌స్టా ద్వారా స్వయంగా వెల్లడించాడు. పాండ్యా పోస్టు చేసిన ఫొటోలో నటాషా తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తోంది. ‘మై తేరా, తూ మేరీ జాన్, సారా హిందూస్థాన్’ అని ఆ పోస్టుకు పాండ్యా క్యాప్షన్ తగిలించాడు.

కాబోయే కొత్త జంటకు టీమిండియా సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సారథి కోహ్లీ, కుల్దీప్ యాదవ్, ధోనీ భార్య సాక్షి, అజయ్ జడేజా, కృనాల్ పాండ్యా భార్య పంఖూరి శర్మ, సోఫీ చౌదరి, సోనాల్ చౌహాన్, శ్రేయాస్ అయ్యర్, మన్‌దీప్ సింగ్, ముంబై ఇండియన్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది.

సెర్బియా నటి అయిన నటాషా ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో వచ్చిన సత్యగ్రహ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిందీ బిగ్‌బాస్-8లో పోటీ పడడం ద్వారా క్రేజ్ పెంచుకుంది. మంచి డ్యాన్సర్ అయిన నషాటా ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, సినిమాల్లో నటిస్తోంది.