లాక్‌డౌన్ వేళ.. ధోనీ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా? మీరే చూడండి…

3:39 pm, Mon, 27 April 20
team-india-cricketer-ms-dhoni-takes-ziva-for-a-bike-ride-inside-ranchi-farmhouse

రాంచీ: కరోనాతో దునియా మొత్తం ఖాళీ అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.

అత్యవసరమైనవి తప్ప అన్ని వ్యాపారాలూ బంద్. క్రీడా పోటీలు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. 

దీంతో సామాన్యుడు, సెలబ్రిటీ సమానం అయిపోయారు. అందరూ ఇంట్లోనే. సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఎవరి ఇళ్లకు వారు పరిమితమైపోయారు. ఎన్నడూ లేనిది ఇన్నిరోజులపాటు ఖాళీ సమయం దొరకడంతో కుటుంబ సభ్యులతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 

అంతేకాదు, ఇంటిపట్టునే ఉండి, తామేం చేస్తున్నారో, కుటుంబ సభ్యులతో ఎలా గడుపుతున్నారో తెలిపే వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్టు చేస్తూ తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

పనిలో పనిగా కరోనా వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఎవరికి వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

షెడ్యూల్ ప్రకారం మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్2020 కరోనా లాక్‌డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి లాక్‌డౌన్ ఎత్తివేశాక, పరిస్థితులను బట్టి ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. 

దీంతో క్రికెట్ క్రీడాకారులకు కూడా బోలెడంత సమయం దొరికినట్లయింది. ఎవరికి వారు ఇంటిపట్టునే ఉంటూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు.

ఫామ్‌హౌస్‌లో ‘మిస్టర్ కూల్’…

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా తన సతీమణి సాక్షి, కుమార్తె జీవాలతో కలిసి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలే ధోనీకి బైక్ రైడింగ్ అంటే చిన్నతనం నుంచీ మోజు.

ఇక ఇప్పుడు లాక్‌డౌన్ విరామంలో ఊరుకుంటాడా? బైక్‌పై తన కుమార్తె జీవాను ఎక్కించుకుని తన ఫామ్‌హౌస్ ఆవరణలో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ సతీమణి సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రీ కూతుళ్ల బైక్ రైడింగ్ చూసి ధోనీ అభిమానులు తెగ  సంబరపడుతున్నారు. ధోనీ ఫామ్‌హౌస్ అద్భుతంగా ఉందంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on