చెన్నై: టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ సింగ్(56) కారును శుక్రవారం ఉదయం చెన్నై పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు ఆయనకు రూ.500 జరిమానా కూడా విధించారు.
ఆ సమయంలో రాబిన్ సింగ్ వద్ద ఈ-పాస్ కూడా లేదు. తన ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పోలీసులు తన కారును స్వాధీనం చేసుకోవడంతో రాబిన్ కంగుతిన్నాడు.
అసలేం జరిగిందంటే..
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర రాజధాని నగరం చెన్నైతోపాటు ఆ రాష్ట్రంలోని మరో మూడు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చెన్నై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు తాము నివాసం ఉంటోన్న ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల పరిధి దాటి గనుక వస్తే.. వాహనాలు సీజ్ చేయడమేకాక, జరిమానా కూడా విధిస్తున్నారు.
అత్యవసర సేవలకు మినహా రోడ్లపై వ్యక్తిగత వాహనాలను కూడా అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ సింగ్ కూరగాయల కోసం తన కారులో రోడ్డెక్కాడు.
ఆద్యండి నుంచి ఉత్తండికి వెళుతున్న అతడి కారును పోలీసులు ఆపి ప్రశ్నించారు. అతడి వద్ద ఈ-పాస్ లేకపోవడం, పైగా అతడు ఏ పనిపై కారులో ప్రయాణిస్తున్నాడనే విషయంలో సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు కారును సీజ్ చేశారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అయినా సరే.. లాక్డౌన్ నిబంధనలు అతడు ఉల్లంఘించినట్లు తేల్చిన పోలీసులు అతడి కారును శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్కి తరలించడమేకాక రూ.500 జరిమానా కూడా విధించారు.
ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..‘‘ఈ రోజు ఉదయం రాబిన్ సింగ్ తన కారులో ఈస్ట్ కోస్ట్ రోడ్(ఈసీఆర్) నుండి వస్తున్నాడు. ఆపి తనిఖీ చేయగా.. అతడి వద్ద ఈ-పాస్ లేదు, అలాగే కారులో ప్రయాణించడానికి సరైన కారణం కూడా అతడు మాకు చెప్పలేదు. అయితే అతడు మాతో మర్యాద పూర్వకంగానే మాట్లాడాడు. మేం నిబంధనల ప్రకారం అతడి కారు సీజ్ చేసి జరిమానా విధించాం..’’ అని పేర్కొన్నారు.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. రాబిన్ సింగ్ టీమిండియా తరుపున 136 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 2,336 పరుగులు చేయగా.. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. 1999 వన్డే వరల్డ్ కప్లో కూడా టీమిండియా తరుపున ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఆ సెంచరీయే అతడి అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇక అతడు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.
టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించిన రాబిన్ సింగ్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు.