‘పింక్’ టెస్టుకు టీమిండియా రెడీ.. ఈడెన్ గార్డెన్స్‌లో తొలి డే-నైట్ మ్యాచ్

9:09 am, Wed, 30 October 19

కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్‌‌గా పగ్గాలు చేపట్టి వారం రోజులైనా కాకముందే సౌరవ్ గంగూలీ తొలి విజయం సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో కొంగొత్త మార్పులు తీసుకొస్తానని తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజే గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

అన్నట్టుగానే భారత క్రికెట్ జట్టుతో డే-నైట్ టెస్టు ఆడించబోతున్నాడు. చరిత్రలో తొలిసారిగా టీమిండియా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో డే-నైట్ టెస్టు ఆడనుంది. వచ్చే నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌ని డే- నైట్‌ మ్యాచ్‌గా నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించింది.

గంగూలీ ఏమన్నాడంటే…

డే-నైట్ టెస్టుపై గంగూలీ మాట్లాడుతూ.. తన ఎజెండాలో అత్యంత ముఖ్యమైనది నెరవేరిందని అన్నాడు. ‘‘ఇది చాలా మంచి పరిణామం. టెస్ట్ క్రికెట్‌కి మరింత ప్రోత్సాహం కావాలి. నేను, నా జట్టు దీనిపై దృష్టి సారించాం. కెప్టెన్ కోహ్లీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నాడు..’’ అని పేర్కొన్నాడు.

తొలి డే అండ్- నైట్ టెస్ట్ మ్యాచ్‌ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య 2015లో జరిగింది. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫ్లడ్ లైట్ల మధ్య ఐదు రోజుల మ్యాచ్ ఆడనుంది. అయితే ఇటువంటి టెస్టులు ప్రతీ ఏడాది జరిగితే బాగుంటుందని గంగూలీ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాలో ప్రతీ ఏడాది పింక్ టెస్ట్‌ నిర్వహిస్తారు.  బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు జేన్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ఈ టెస్ట్‌ని నిర్వహిస్తుంది. అదే విధంగా ఈడెన్ టెస్ట్‌ కూడా ప్రతీ ఏడాది జరగాలని తాను కోరుకుంటున్నానంటూ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.