ఐపీఎల్‌లో సహచరులే జాతివివక్ష చూపేవారు.. ఇప్పుడే అర్థమైంది: డారెన్ సామి

5:09 pm, Sun, 7 June 20

జమైకా: ఐపీఎల్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లకు ఏ స్థాయిలో ఆదరణ ఉంటుందో అందరికీ తెెలిసిందే. వెస్టిండీస్ హిట్టర్లు క్రిస్‌గేల్, ఆండ్రూ రస్సెల్, పోలార్డ్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలరు.

వీరితో పాటు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ, డారెన్ బ్రావో, డ్వేన్ స్మిత్, లెండిల్ సిమన్స్ వంటి ఆటగాళ్లకూ భారత్‌లో అనేకమంది అభిమానులున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌కు సంబంధించి డారెన్ సామీ సంచలన విషయాలను వివరించాడు. అతడిపై సహచరులు చూపే జాతివివక్షను బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే…

ఇటీవల జాతివివక్షపై అమెరికాతోపాటు అనేక దేశాల్లో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నిరసనలకు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ మొదటి నుంచి తన పూర్తి మద్దతు తెలుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేదికగా సహచరులే తనపై జాతివివక్ష చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల హసన్ మినాజ్ నిర్వహించిన పేట్రియాట్ యాక్ట్ అనే కార్యక్రమం చూసిన తరువాత ఈ విషయం తనకు తెలిసిందన్నాడు.

అది తెలిసినప్పటినుంచి చాలా కోపంగా ఉందని, జాతివివక్షతో నన్నలా పిలిచేవారంటే నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.

“నేను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడే సమయంలో నన్ను అందరూ ‘కాలూ’ అని పిలిచేవారు.

శ్రీలంక ఆటగాడు థిసారా పెరీరాను కూడా అదే పేరుతో పిలిచేవారు. అయితే అప్పట్లో నాకు ఆ పేరుకు అర్థం తెలియదు.

ఏదో గొప్ప పేరు అయి ఉంటుందిలే అనుకున్నా. ధైర్యవంతుడైన నల్లజాతీయుడని అంటున్నారనుకున్నా. కానీ ఈ మధ్య దాని అర్థం తెలిసింది.

అప్పటినుంచి చాలా కోపంగా ఉంది. నన్ను వారంతా అవమానించారు.’ అంటూ సామీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.