సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం: చేజారిన వన్డే సీరిస్, ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్

9:37 am, Thu, 14 March 19
india-australia

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ముందు స్వదేశంలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. టీ20 సిరీసే కాదు.. వన్డే సిరీస్‌లోనూ కోహ్లీసేనకు ఓటమిపాలైంది. ఇప్పటిదాకా వన్డేల్లో 0-2తో వెనుకబడి ఎన్నడూ సిరీస్‌ గెలవని ఆస్ట్రేలియా.. ఈసారి చరిత్రను తిరగరాసింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో 35 పరుగుల విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

సొంతగడ్డపై భారత్‌ చేతిలో టెస్టులు, వన్డేల్లో ఓడి పరాభవం చవిచూసిన కంగారూ జట్టు.. ఇప్పుడు భారత్‌ను స్వదేశంలో టీ20లు, వన్డేల్లో మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకుంది. మంచి ఫామ్‌ కొనసాగిస్తూ ఓపెనర్‌ ఖవాజా (100; 106 బంతుల్లో 10×4, 2×6) సెంచరీ చేయడంతో మొదట 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన ఆసీస్‌.. భారత్‌ను సరిగ్గా 50 ఓవర్లలో 237 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

అంతకుముందు టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సిరీస్‌లో మొదటి నుంచి అద్భుతంగా రాణిస్తున్న ఖాజా మరోసారి భారత బౌలర్లకు సవాల్‌గా నిలిచాడు. గత వన్డేలో రాణించి ఫాంలోకి వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ (27) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పీటర్ హాండ్స్‌కాంబ్‌తో కలిసి ఖాజా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అందివచ్చిన ప్రతి బంతిని బౌండరీలకు తరలిస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు హాండ్స్‌కాంబ్ కూడా తనదైన శైలిలో చెలరేగుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ధాటిగా ఆడుతూనే హాండ్స్‌కాంబ్ కూడా ఖవాజాకు చక్కటి సహకారం అందించాడు. ఈ దశలో ఖావాజా (100) తన కెరీర్‌లో రెండో సెంచరీ సాధించి, ఆ వెంటనే భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియ న్‌కు చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1)ని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

అనంతరం మార్కస్ స్టొయనిస్‌తో జతకట్టిన హాండ్స్‌కాంబ్ (52) అర్ధ సెంచ రీ పూర్తిచేసి షమీ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ ఆస్ట్రేలియా 4 కీలక వికెట్లు కోల్పోయ 182 పరుగులు చేసింది. ఈ క్రమంలో గత మ్యాచ్ హీరో ఆస్టాన్ టర్నర్ (20), స్టొయనిస్ (20), అలెక్స్ క్యారీ (3) నిరాశ పరచగా, చివర్లో జే రిచర్డ్‌సన్ (29) చెలరేగినా కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ (15), నాథన్ లియాన్ (1, నాటౌట్) పోరాడినా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయ 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు 2, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

కెప్టెన్ కోహ్లీ తక్కువ స్కోరుకే.. ధావన్ అలాగే..

టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కోహ్లీ (20) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. గత వన్డేలోనూ తక్కువ స్కోరుకే అవు టైన కోహ్లీ, సిరీస్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తొందరగానే అవుటై నిరాశపరిచాడు.

వరుసగా విఫలమవుతూ నాలుగో వన్డేలో సెంచరీ చేసిన శిఖర్ ధావన్, చివరి వన్డేలో మళ్లీ నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతులను ఎదుర్కొన్న ధావన్ 2 బౌండరీలతో 12 పరుగులు మాత్రమే చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక యువ వికెట్ కీపర్ సంచలనం రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లోనూ రాణించలేకపోయాడు. రెండో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన పంత్ 1 సిక్సర్, 1 బౌండరీతో కేవలం 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఇక ఆల్‌రౌండర్‌గా ఇప్పుడిప్పుడే రాణిస్తున్న విజయ్ శంకర్ మరోసారి విఫలమయ్యాడు. 21 బంతులను ఎదుర్కొన్న విజయ్ శంకర్ 1 బౌండరీతో 16 పరుగులు మాత్రమే చేసి జంపా బౌలింగ్‌లో ఖాజాకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రవీంద్ర జడేజా సైతం (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

రాణించిన రోహిత్.. జాదవ్, భువీ కీలక భాగస్వామ్యం

గత మ్యాచ్‌లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ (56) ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొదట పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డా, అనవసర బంతుల్ని వదిలి, అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించాడు. అర్ధ సెంచరీ తర్వాత అనవసరంగా హిట్టింగ్‌కు వచ్చి జంపా బౌలింగ్‌లో స్టాంపవుట్‌గా వెనుదిరిగాడు.

132 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడ్డ టీమిండియాను కేదార్ జాదవ్, భువనేశ్వర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 92 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించి భారత శిబిరంలో ఆశలు రెకెత్తించారు. అయితే అర్ధ సెంచరీకి దగ్గరగా ఉన్న జాదవ్ 44)ను రిచర్డ్‌సన్ పేవిలియన్‌కు పంపించగా, ఆ తర్వాతి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ (46) కూడా ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మహమ్మద్ షమీ (3), కుల్దీప్‌యాదవ్ (8), జస్ప్రీత్ బుమ్రా (1, నాటౌట్) అవుటవ డంతో భారత్ 35 పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఉస్మాన్ ఖవాజాకు దక్కింది.