ప్రో కబడ్డీ లీగ్‌: దబాంగ్‌ ఢిల్లీ ఖాతాలో మరో విజయం.., మరో మ్యాచ్‌లో పోరాడి ఓడిన బెంగళూరు బుల్స్

dabang delhi1
- Advertisement -

dabang delhi2

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-6లో దబాంగ్‌ ఢిల్లీ రెండో విజయం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డిఫెన్స్‌తో అదరగొట్టిన దబాంగ్‌ ఢిల్లీ 39-30 స్కోరు తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది.

- Advertisement -

దబాంగ్‌ ఢిల్లీ జట్టు తరఫున నవీన్‌ కుమార్‌ 11 పాయింట్లు, చంద్రన్‌ రంజిత్‌ 7  రైడ్‌ పాయింట్లు సాధించి తమ జట్టుకి విజయాన్ని అందించారు. ట్యాకిలింగ్‌లో రవీందర్‌ పహల్‌ 4 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.

జాంగ్‌ కున్‌ లీ రాణించినా…

బెంగాల్ వారియర్స్‌ జట్టు తరపున జాంగ్‌ కున్‌ లీ 10 పాయింట్లతో రాణించినప్పటికీ తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. బెంగాల్‌ వారియర్స్‌ ఆటగాళ్లు మణీందర్‌ సింగ్‌ 6 పాయింట్లు, మహేశ్‌ గౌడ్‌ 5 రైడ్‌ పాయింట్లు సాధించారు. ట్యాకిలింగ్‌లో సుర్జిత్‌ సింగ్‌ 2 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు.

మ్యాచ్‌ ఆరంభం నుంచి రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. దాంతో స్కోర్లు 2-2, 4-4 ఇలా సమం అవుతూ వచ్చాయి. మణీందర్‌ సింగ్‌ రైడింగ్‌లో రెండు పాయింట్లు తీసుకురావడంతో మ్యాచ్‌లో తొలిసారి ఎనిమిదో నిమిషంలో బెంగాల్ వారియర్స్‌ 8-5 స్కోరుతొ ఆధిక్యం సంపాదించింది.

పుంజుకున్న దబాంగ్ ఢిల్లీ…

అయితే వెంటనే పుంజుకున్న దబాంగ్ ఢిల్లీ జట్టు 8-8తో స్కోరుని సమం చేసింది. అంతేకాదు, అదే జోరును ప్రదర్శిస్తూ.. బెంగాల్ వారియర్స్‌ జట్టును ఆలౌట్‌ చేసి 12-9 స్కోరుతో ఆధిక్యంలోకి వెళ్ళింది.

తొలి అర్ధభాగం ముగిసేసరికి దబాంగ్ ఢిల్లీ 16-13 స్కోరుతో పైచేయి సాధించింది. విరామం తర్వాత ఢిల్లీ జట్టు మరింత దూకుడుగా ఆడింది.  ప్రత్యర్థి  జట్టుని రెండోసారి ఆలౌట్‌ చేసి 25-15 స్కోరుతో తిరుగులేని స్థాయిలో నిలిచింది.

ఆ తరువాత కూడా మ్యాచ్‌ చివరి వరకు తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని దబాంగ్ ఢిల్లీ జట్టు.. బెంగాల్ వారియర్స్ జట్టుపై విజయం సాధించింది.  ఇక ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ జట్టు 27–25 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది.

సోమవారం ప్రొ కబడ్డీ లీగ్‌‌లో విశ్రాంతి దినం.

మంగళవారం జరిగే మ్యాచ్‌లు..

తెలుగు టైటాన్స్‌  Vs  యు ముంబా …  తమిళ్‌ తలైవాస్‌  Vs పుణేరి పల్టన్‌

- Advertisement -