ప్రో కబడ్డీ లీగ్: బోణీ కొట్టిన పుణేరి పల్టన్.. సొంతగడ్డపై తమిళ తలైవాస్ ఓటమి…

pro kabadi.5
- Advertisement -

 

puneri-paltan-haryana-stealers

హైదరాబాద్: చెన్నై వేదికగా నిన్న జరిగిన  ప్రో కబడ్డీ లీగ్ సీజన్ -6లో ఎట్టకేలకు పుణేరి పల్టన్ తన ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో యు ముంబాతో డ్రాతో సరిపెట్టుకున్న పల్టన్.. సోమవారం జరిగిన జోన్ -ఎ రెండో మ్యాచ్‌లో 34-22 స్కోరుతో నెగ్గి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.  పుణేరి పల్టన్ జట్టు కెప్టెన్ నితిన్ తోమర్ అద్భుతంగా ఆడి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే ఈ మ్యాచ్‌ ప్రారంభంలో హర్యానా స్టీలర్స్ జట్టు చాలా బాగా ఆడింది. పటిష్టమైన డిఫెన్స్‌తోపాటు రైడింగ్‌లో కూడా దూకుడుతన ప్రదర్శిస్తూ..  ఆట మొదలైన ఏడో నిమిషంలోనే  4-2 స్కోరుతో ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే నెమ్మదిగా పుంజుకున్న పుణేరి పల్టన్ జట్టు.. 6-7తో ప్రత్యర్థి జట్టు స్కోరును సమీపించింది.

సురేందర్ నాడా రెండు ట్యాకిల్ పాయింట్లు తీసుకురావడంతో ఆధిక్యంలోకి వెళ్లిన పుణేరి పల్టన్… ఆ తర్వాత నితిన్ తోమర్ మరో రెండు రైడ్ పాయింట్లు సంపాదించడంతో తమ అధిక్యాన్ని మరింత పెంచుకుంది. అంతేకాదు, ఆట 19వ నిముషంలో హర్యానా స్టీలర్స్ జట్టును అలౌట్ చేసి 14-8తో నిలిచింది.

రెండో అర్ధభాగంలోహర్యానా స్టీలర్స్ జట్టు పుంజుకుని 5 పాయింట్లు గెలవడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. కానీ పుణేరి పల్టన్ కెప్టెన్ నితిన్ తోమర్ మరోసారి డబుల్ రైడ్ పాయింట్లు గెలవడంతో 20-14 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. 36వ నిమిషంలో మరోసారి హర్యానా స్టీలర్స్‌ను ఆలౌట్ చేసి 30-17తో విజయం దిశగా దూసుకెళ్లింది.

చివర్లో హర్యానా స్టీలర్స్ పుంజుకున్నా ఫలితం లేకపోయింది.  పుణేరి పల్టన్ జట్టు 34-22 స్కోరుతో విజయాన్ని సొంతం చేసుకుంది. నితిన్ తోమర్ ఏడు రైడ్ పాయింట్లు, రవికుమార్ మూడు పాయింట్లు సాధించారు.

tamil-thalaivas-ajay-thakur

యూపీ యోధ చేతిలో ఓడిన తమిళ్ తలైవాస్…

మరో మ్యాచ్‌లో యూపీ యోధ 37-32 స్కోరుతో తమిళ తలైవాస్ జట్టును ఓడించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్‌కు షాకిచ్చి జోరు మీదన్న తమిళ తలైవాస్, ఈ మ్యాచ్‌లో ప్రారంభంలోనే తడబడింది. వరస రైడ్ పాయింట్లతో  ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన యూపీ యోధ 15-2 స్కోరుతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

కానీ అజయ్ ఠాకూర్ మెరుపు రైడ్లతో ద్వితీయార్ధంలో తలైవాన్ 19-27 స్కోరుతో పుంజుకుంది. అజయ్‌తో పాటు జస్వీర్ కూడా రాణించడంతో ఒక దశలో 30-32 స్కోరుతో యోధ స్కోరుకు అత్యంత సమీపానికి వచ్చింది. కానీ ప్రశాంత్ కుమార్ వరుస పాయింట్లు తీసుకురావడంతో యూపీ యోధ 34-32 స్కోరుతో విజయాన్ని అందుకుంది. యూపీ యోధ జట్టులో ప్రశాంత్ కుమార్ 8 పాయింట్లు, నరేందర్ 4 ట్యాకిల్ పాయింట్లతో తమ  సత్తాను చాటారు.

- Advertisement -