మంధాన అద్భుత సెంచరీ: కివీస్‌పై టీమిండియా మహిళల జట్టు గెలుపు

mandhana
- Advertisement -

నేపియర్‌: బుధవారం టీమిండియా పురుషుల జట్టు న్యూజిలాండ్‌ పురుషుల జట్టుపై విజయం సాధించగా.. గురువారం టీమిండియా మహిళలు జట్టు కూడా కివీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి కివీస్ పర్యటనను శుభారంభం చేసింది. గురువారం నేపియర్‌ వేదికగా టీమిండియా-కివీస్‌ మహిళా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మిథాలీ సేన బోణీ కొట్టింది.

న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 192 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా సాధించేసింది. స్మృతి మంధాన శతకంతో ఆకట్టుకోవడంతో భారత మహిళల జట్టుకు విజయం సులువైంది. దీంతో 33 ఓవర్లలోనే టీమిండియా ఇన్నింగ్స్‌ను ముగించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి టీమిండియా కివీస్‌ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. 32 ఓవర్ల వరకూ వికెట్‌ కోల్పోకుండా లక్ష్య ఛేదనలో నిమగ్నమైంది.

మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

రోడ్రిగోస్‌ నిలకడకు మంధాన దూకుడు తోడవ్వడంతో టీమిండియాకు విజయం నల్లేరుపై నడకలా సాగింది. ఈ క్రమంలో మంధాన శతకం పూర్తి చేసుకుంది. రోడ్రిగోస్‌-మంధాన జోడీ కలిసి 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మ్యాచ్‌ను ఓపెనర్లే ముగిస్తారని అందరూ భావించారు. అయితే టీమిండియా విజయానికి మరో ఐదు పరుగులు కావల్సి ఉండగా మంధానను అమీలియా కెర్‌ పెవిలియన్‌ చేర్చింది.

ఆ తర్వాత రోడ్రిగోస్‌ మూడు పరుగులు చేసి కివీస్‌ లక్ష్యాన్ని సమం చేయగా చివరి బంతిని వైడ్‌గా ప్రకటించడంతో టీమిండియా ఖాతాలో ఒక పరుగు చేరింది. దీంతో వికెట్‌ నష్టానికి టీమిండియా 33 ఓవర్లలోనే గెలుపును సొంతం చేసుకుంది. శతకంతో ఆకట్టుకున్న మంధానకు ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

- Advertisement -