న్యూజిలాండ్‌లో బంగ్లా క్రికెటర్లకు తప్పిన ముప్పు: రెండు మసీదుల్లో కాల్పులు, ఆరుగురు మృతి

9:52 am, Fri, 15 March 19
new zealand-bangla

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు. క్షతగాత్రుల్ని అంబులెన్సులో స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు గురైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు ఓ వైపు సహాయక చర్యలు చేపడుతూనే.. ఆగంతకుడిపై కాల్పులు కొనసాగిస్తున్నారు.

కాగా, మరో మసీదులోనూ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలోనూ పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్యపై వివరాలు తెలియాల్సి ఉంది.

బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదం..

టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం. అదృష్టవశాత్తూ వారు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. తాము సురక్షితంగా తప్పించుకున్నట్లు క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. ‘దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. ఇది భయంకరమైన అనుభవం. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి’ అని తమీమ్ పేర్కొన్నాడు. తమ అభిమాన క్రికెట్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో బంగ్లా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.