అందుకే ‘కశ్మీర్’ను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇమ్రాన్ ఖాన్ అక్కసు

- Advertisement -

న్యూఢిల్లీ : కశ్మీరు సమస్యపై అంతర్జాతీయ సమాజం స్పందించడం లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీలోని బాన్‌లో ప్రభుత్వ యాజమాన్యంలోని అంతర్జాతీయ వార్తా సంస్థతో శుక్రవారం ఆయన మాట్లాడారు. కశ్మీరు సమస్యపై అంతర్జాతీయంగా స్పందన కరవైందని అంగీకరించారు. పాశ్చాత్య దేశాలకు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పాశ్చాత్య దేశాలకు వ్యాపార ప్రయోజనాలే చాలా ముఖ్యమైనవని, భారత దేశం చాలా పెద్ద మార్కెట్ కావడంతో కశ్మీర్ విషయాన్ని అవి పక్కన పెట్టేశాయని అన్నారు. కశ్మీరులోని 80 లక్షల మందికి, భారత దేశంలోని మైనారిటీలకు జరుగుతున్నదానికి అంతంత మాత్రం స్పందన రావడం వెనుకనున్న కారణం వ్యాపార ప్రయోజనాలేనని ఇమ్రాన్ పేర్కొన్నారు.

ఇమ్రాన్ తన ఇంటర్య్వూలో అత్యధిక సమయాన్ని భారత్‌పై విషం చిమ్మడంతోనే సరిపెట్టారు. పాకిస్థాన్ శాంతి యత్నాలపై భారత్ స్పందించడం లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావజాలమే దీనికి కారణమన్నారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల గురించి ప్రశ్నించినపుడు ఇమ్రాన్ స్పందిస్తూ.. భారత దేశంలో జరుగుతున్నదానిని ప్రపంచాన్ని హెచ్చరించిన మొదటి నాయకుడిని తానేనన్నారు. భారత్ ‘హిందుత్వ’ అనే అతివాద భావజాలం ఆక్రమించిందని ఆరోపించారు. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలమని వివరించారు. హాంగ్‌కాంగ్ నిరసనలపై మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని, కశ్మీరు విషాదం అంతకన్నా ఎక్కువ అని ఇమ్రాన్ వివరించారు.

- Advertisement -