భారత్ విజయాలకు అడ్డుకట్ట.. కోహ్లీ సేనను ఉతికారేసిన కంగారూలు

5:43 pm, Wed, 15 January 20
finch-and-virat-in-india-vs-australia-first-one-day-match

ముంబై: కోహ్లీ సేన వరుస విజయాలకు అడ్డుకట్ట పడింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. భారత్ నిర్దేశించిన 256 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే అందుకుంది.

వార్నర్ 128 (112 బంతుల్లో 17ఫోర్లు, 3సిక్సులు), ఆరోన్ ఫించ్ 110 (114బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సులు) పరుగులతో చెలరేగారు. వన్డే ఫార్మాట్‌లో భారత్ జట్టుపై 249పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జోడీగా రికార్డులకెక్కారు.

లంకపై సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్‌కు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. ఈ క్రమంలోనే భారత్‌ను 255పరుగులకే ఆలౌట్ చేసింది. మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్.. రిచర్డ్‌సన్ చెరో 2, ఆడం జంపా, ఆష్టన్ అగర్ చెరొక వికెట్ తీశారు.

రోహిత్ శర్మ(10), కేఎల్ రాహుల్(47), విరాట్ కోహ్లీ(16), శ్రేయాస్ అయ్యర్(4), రిషబ్ పంత్(28), రవీంద్ర జడేజా(25), శార్దూల్ ఠాకూర్(13), మొహమ్మద్ షమీ(10), కుల్దీప్ యాదవ్(17), జస్ప్రిత్ బుమ్రా(0)పరుగులు చేయగలిగారు.

చెలరేగిన ఆసీస్ బౌలర్లు…

134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. అర్ధ సెంచరీకి 3 పరుగుల దూరంలో రాహుల్ పెవిలియన్ చేరాడు. 61 బంతుల్లో 4 ఫోర్లతో కలిపి 47 పరుగులు చేశాడు. అగర్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతూ చక్కని భాగస్వామ్యం అందించాడు.

అయితే, ఆ తర్వాత ఆసీస్ బౌలర్ల దాటికి క్రీజులో ఎవరూ నిలవలేకపోయారు. ఫలితంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 255 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనున్నాయి.