‘పరాన్నజీవి’కి భయపడి ‘పవర్‌స్టార్’ సినిమా కథను వర్మ మార్చేశాడు: నూతన్ నాయుడు

4:21 pm, Sat, 25 July 20

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యా‌ణ్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అంటూ సినిమా తీసి విడుదల కూడా చేసేశాడు. 

తన సినిమాల కంటే తనే ఎక్కువగా పాప్యులర్ అయ్యే వర్మ నేడు ‘పవర్ స్టార్’ సినిమాను ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేశాడు. సినిమా ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ సినిమా కోపం తెప్పించింది.

 వర్మ ‘పవర్ స్టార్’ సినిమాకు కౌంటర్ ‘పరాన్నజీవి’ సినిమాను దర్శకుడు నూతన్ నాయుడు తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు చానల్‌తో మాట్లాడారు.

తాను ‘పరాన్నజీవి’ సినిమాను ప్రకటించిన తర్వాత వర్మ భయపడ్డాడని, పవర్‌స్టార్ సినిమా కథను మార్చేశాడని నూతన్ నాయుడు అన్నారు. సినిమా మొత్తాన్ని రీషూట్ చేశాడని చెప్పుకొచ్చారు. 

పవన్ కల్యాణ్ ప్రజా సంక్షేమం గురించి పోరాడుతున్నారని, వర్మకు రాజకీయాల మీద ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. వర్మవి అన్నీ దొంగ తెలివి తేటలని, ఎవరో ఆయనతో వెనకుండి మాట్లాడిస్తున్నారని నూతన్ నాయుడు విమర్శించారు.  

‘పవర్‌స్టార్’ నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. నూతన్ నాయుడు ఆరోపణలను కొట్టిపడేశారు. ‘పరాన్నజీవి’ సినిమాకు భయపడి ‘పవర్‌స్టార్’ కథను మార్చామని చెప్పడం వాస్తవం కాదన్నారు.

మూడు నాలుగు రోజుల్లోనే కథలో మార్పులు చేసి మళ్లీ షూట్ చేయడం అసాధ్యమని నట్టికుమార్ స్పష్టం చేశారు.